ఏప్రిల్‌ 22 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. కొత్త పరీక్షల షెడ్యూల్‌ను సచివాలయంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుతో కలిసి గురువారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జెఇఇ మొదటి విడత పరీక్షలు జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 8 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 10 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. మొత్తం 1400 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 11 నుంచి 31 వరకు నిర్వహిస్తామన్నారు. పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథాతథంగా ఉంటాయన్నారు.