చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం అవసరమైతే ఆమరణ దీక్షకు సిద్ధమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని పాతబస్టాండు వద్ద మంగళవారం ఎంపీ వెంకట్‌రెడ్డి దీక్ష చేపట్టారు. కొడుకు కేటీఆర్ కోసం 4 మండలాలతో సిరిసిల్లను జిల్లా చేసిన సీఎం కేసీఆర్.. భౌగోళికంగా, చారిత్రకంగా అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఎందుకు ఏర్పాటు చేయడంలేదని నిలదీశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడే కేసీఆర్.. ఈ ప్రాంతంపై వివక్ష చూపడం తగదన్నారు. కొత్త జిల్లాల పేరిట చేర్యాలను ముక్కలు చెక్కలుగా చీల్చి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. తనది భయపడేతత్వం కాదని, చేర్యాల ప్రజల కోరిక నెరవేర్చేందుకు దేనికైనా తెగిస్తానని స్పష్టం చేశారు. ఒకరోజు దీక్ష కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేర్యాల కోసం ఆమరణ దీక్ష చేస్తా