నేటి నుండి ఎపి లో నామినేషన్లు

ఎపి లోని పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల విషయంలో ప్రభుత్వం, ఎస్‌ఈసీ తీరు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం నేటి ఉదయం 10 గంటలకు తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంది. తొలి దశలో ప్రకాశం, విజయనగరం మినహా 11 జిల్లాల్లోని 146 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసి రిటర్నింగ్‌ అధికారులను నియమించాల్సిన జిల్లా కలెక్టర్లు మాత్రం ఎస్‌ఈసీ ఆదేశాలను పక్కనపెట్టి ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారని, ఇంత వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవో లు, డీపీవో లకు ఉత్తర్వులు వెళుతున్నాయి. కానీ అటు నుంచి ఎలాంటి స్పందనా ఉండటం లేదు.