మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ రాజీనామా

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతో కమల్‌నాథ్‌ సర్కార్‌కు మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడిచిన 15 నెలల్లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అయినా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కర్ణాటకలో బంధించారని తెలిపారు.