రోడ్ల ప్రగతికి ఏడాది గడువు : జగన్‌

రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. విపక్షాల విమర్శలను చాలెంజ్‌గా తీసుకుని, గుంతలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. రోడ్ల అభివృద్ధి ప్రగతిపై అధికారులకు ఏడాది గడువును నిర్దేశించారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌శాఖల రోడ్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన రోడ్ల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7,804 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధికి రూ.2,500 కోట్లను, పంచాయతీరాజ్‌ (పిఆర్‌) రహదారులకు రూ.1,073 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వర్షాకాలంలోగా అన్ని రోడ్లకూ మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. గతంలోనూ, ప్రస్తుతం ఎంతెంత ఖర్చు చేశారో ప్రజల ముందుంచాలన్నారు. నాడు-నేడు పేరుతో ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్రిడ్జిలు పూర్తయి అప్రోచ్‌ రోడ్లు లేనివి, పెండింగు బ్రిడ్జిలు, ఆర్‌ఒబిలను పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల న్నారు. 38 ఆర్‌ఒబిల పూర్తికి రూ.2,661 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.