బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి ఏటువంటి సమాచారాన్ని.. ఏ సమయంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ). నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి)లు లీక్ చేయలేదని అదనపు సొలిసిటర్ జనరల్(ఎఎస్జి) అనిల్ సింగ్ బాంబే హైకోర్టుకు తెలిపారు. సుశాంత్ ఈ ఏడాది జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మీడియా ప్రచారాన్ని, రిపోర్టింగ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బాంబే హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ఈ పిల్లను మాజీ రిటైర్డ్ పోలీసు అధికారులు దాఖలు చేశారు. సున్నితమైన సమాచారాన్ని పలు ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు కేసుకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తున్నాయా అని వారు ప్రశ్నించారు. తమ బాధ్యతల పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నాయి.
