అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురైంది. చైనాతో సరిహద్దు వివాదం మొదలైన తర్వాత ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించాలని భారత్‌ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులను ప్రధాన భారతీయ ఓడరేవుల్లోని కస్టమ్స్‌ అధికారులు తిరిగి వెనక్కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, వీటిలో చైనాలో తయారవుతున్న ఆపిల్‌, డెల్‌, సిస్కో, ఫార్వర్డ్‌ మోటారు కంపెనీలకు చెందిన అమెరికా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం, అమెరికా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ లాబీయింగ్‌ గ్రూప్‌, భారత్‌ వాణిజ్య మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. పెద్ద నౌకాశ్రయాల్లో, విమానాశ్రయాల్లో చైనా నుండి వచ్చే తమ ఉత్పత్తులను కస్టమ్స్‌ అధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లోని విమానాశ్రయాల్లో చైనా నుండి దిగుమతయ్యే వస్తువులపై నూతన పరిశీలనా విధానాన్ని అవలంభిస్తామని ఇండియన్‌ సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసిఇఎ) బుధవారం ప్రకటించిన అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.