అమెరికా ఎన్నికల్లో కేంద్ర బిందువుగా ఒబామా

బరాక్‌ ఒబామా.. అమెరికాకు రెండు పర్యాయాలు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఇప్పుడు రానున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కేంద్ర బిందువుగా మారారు. రిపబ్లికన్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు ఈసారి షాక్‌ ఇచ్చేందుకు డెమోక్రాట్లు తమ కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా డెమోక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జోరు బిడెన్‌కు రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉండేందుకు, ట్రంప్‌ను ఓడించేందుకు వ్యూహాలు రచించేందుకు ఒబామాను స్వాగతించేందుకు డెమోక్రాట్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా వద్ద జోరు బిడెన్‌ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఒబామాకు పార్టీలో ఒక ప్రత్యేక స్థానంతో పాటు, అమెరికా ప్రజల్లో పాపులారిటీ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ పాపులారిటీని గట్టిగా ఉపయోగించుకొని ట్రంప్‌ను కోలుకోలేని దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు తహతహలాడుతున్నారు. ప్రధానంగా అమెరికాలో నివసిస్తున్న నల్ల జాతీయులు, యువతలో ఒబామాకు మంచి క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఒబామాను అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దింపి ఆయా వర్గాల ఓట్లను అధిక మొత్తంలో సాధించేందుకు బిడెన్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. ఒబామాపై తమకు సానుకూల అభిప్రాయం ఉందని 57శాతం అమెరికన్లు మన్‌మౌత్‌ యూనివర్సిటీ పోల్‌లో చెప్పడం గమనార్హం.