ఆటో మ్యుటేషన్‌ సేవల పోస్ట్‌ర్‌ను విడుదల చేసిన సీఎం జగన్
ఆటో మ్యుటేషన్‌ సేవల పోస్ట్‌ర్‌ను విడుదల చేసిన సీఎం జగన్

ఆటో మ్యుటేషన్‌ సేవల పోస్ట్‌ర్‌ను విడుదల చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు కానున్నాయి. ఆటో మ్యుటేషన్‌ సేవల పోస్ట్‌ర్‌ను మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విడుదల చేశారు. దీంతో భూయాజమాన్య హక్కుల మార్పిడి(మ్యుటేషన్‌) ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్టయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులకు చెందిన క్రయ, విక్రయ భూమి వివరాలు రిజిస్ట్రేషన్‌ చేయబడినప్పటి రెవెన్యూ రికార్డులలో మార్పుల కోసం తహసీల్దారు కార్యాలయం, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగవలసి వచ్చేది. ఈ ప్రక్రియ వల్ల రైతులకు ఆసౌకర్యం కలుగడమే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ చేయబడిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో సత్వరం మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యుటేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకోచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కులు మరియు పట్టాదార్‌ పాస్‌బుక్‌ చట్టం- 1971 ను సవరించడం ద్వారా భూ బదలాయింపు వివరాలు రికార్డు చేయడం కోసం రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన అధికారులను తాత్కాలిక(ప్రొవిజనల్‌) రికార్డింగ్‌ అధికారులుగా గుర్తించారు. వీరి నియామక అధికారం సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల ఆన్‌లైన్‌ భూమి బదలాయింపు కోసం ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా (ఆర్‌ఓఆర్‌ –1బీ, అడంగల్‌) వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా రెవెన్యూశాఖకు పంపబడతాయి. అలాగే ఈ భూ మార్పిడి వివరాలను మీభూమి పబ్లిక్‌ పోర్టల్‌ (www.meebhoomi.ap.gov.in) లో సరిచూసుకునే సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది.