ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తెచ్చాం: సీఎం జగన్‌

ఈ ఏడాదికాలంలో ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన మరణం తర్వాత ఆ రెండూ పేదవాడికి దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90శాతం నెరవేర్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో​ నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ, 104.. 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి వర్తింపజేశాం. 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. 2 వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ.. జులై 8 నుంచి మరో 6 జిల్లాలో అమలు చేస్తాం. నవంబర్‌ 8 నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేస్తాం. క్యాన్సర్‌ రోగాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. స్పీచ్‌ థెరపీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల కోసం.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నాం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించా’’మని పేర్కొన్నారు.ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా “నాడు-నేడు” చేపట్టాం. కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరిస్తున్నాం. కొత్తగా మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులతోపాటు… ఐటీడీఏ పరిధిలో 7 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. 24 గంటలు వైద్యసహాయం అందుబాటులో ఉండేలా విలేజ్‌ క్లినిక్‌లు. రూ.2,600 కోట్లతో విలేజ్‌, వార్డు క్లినిక్‌లు. రూ.671 కోట్లతో పీహెచ్‌సీలను కూడా ఆధునీకరిస్తున్నాం. జులై 1 నుంచి 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తాం. ఆరోగ్య సమస్యలపై 14410పై టెలీమెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చాం. వైద్యులు సూచించే మందులను కూడా డోర్‌డెలివరీ చేసేలా చర్యలు. ఇంటివద్దకే వైద్యం అందించేలా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ను అందుబాటులో ఉంచుతాం. 9,712 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని కొత్తగా నియమిస్తున్నాం.