ఇళ్లు కాదు…ఊళ్ళే కడుతున్నాం : జగన్‌

రాష్ట్రంలో చేపట్టిన జగనన్న కాలనీల పథకం ద్వారా కేవలం ఇళ్లు కట్టడం లేదని, ఊళ్ల నిర్మాణమే జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గృహనిర్మాణ శాఖపై గురువారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 13వేల పంచాయతీల్లో 17,005 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. జగనన్న కాలనీ మొదటి దశలో భాగంగా 15.60లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రతి ఎంఎల్‌ఏ తల ఎత్తుకుని తిరిగేలా ఈ పనులు సాగుతున్నాయని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న పనులు చూసి ఓర్వలేకే ప్రతిపక్షం విమర్శలకు దిగుతోందని అన్నారు. ‘ జగన్‌కు, వైసిపి మంచి పేరు వస్తుందని బాధ పడుతున్నారు. అందుకే, ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడానికి చంద్రబాబు ఎంతో ప్రయత్నించారు.’ అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 215 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కడితే, వైసిపి ప్రభుత్వంలో 340 చదరపు అడుగల విస్తీర్ణంలో బెడ్‌రూం, లివింగ్‌రూం, కిచెన్‌, బాత్‌రూం కమ్‌ టాయ్ లెట్‌, వరండా వచ్చేలా నిర్మిస్తున్నామని తెలిపారు.