కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ

 నందమూరి బాలకృష్ణ అంటేనే సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన ఏ సినిమా ఫంక్షన్‌కి వెళ్లినా ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తారు. కాకపోతే ఈసారి మనుషులపై కాకుండా.. కరోనా మహమ్మారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నందమూరి బాలకృష్ణ ‘సెహరి’ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన ఆయన కరోనా కారణంగా సినిమా ఇండిస్టీ, సినీ కార్మికులు, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బంది పడుతున్నది తెలిపారు ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లోనూ షూటింగ్‌ చేస్తున్న ‘సెహరి’ చిత్ర యూనిట్‌ను అభినందించారు. అలాగే ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ కొన్ని సూచనలు కూడా చేశారు. పలు ఛానెల్స్‌లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ కార్తీక మాసంలో చల్లటినీటితో తలస్నానం చేయమంటారు. కానీ ఎవరూ చల్లటి నీరుతో తలస్నానం చేయవద్దని నేను చెబుతున్నాను. ఎందుకంటే కరోనా అనేది నిమోనియాకు సంబంధించింది. దానికి ఇంత వరకు వ్యాక్సిన్‌ రాలేదు.రాదు కూడా. కరోనా అనేది మనిషి మెదడును కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. ప్రకతిని మనం అతిక్రమిస్తే, ప్రకతి మనకెలా సమాధానం చెబుతుందనే దానికి ఉదాహరణే ఈ కరోనా. అందుకే ఎవరూ తలస్నానాలు చల్లటినీటితో కాకుండా వేడినీటితోనే చేయండి అని అన్నారు. కరోనా వైరస్‌ ఎంత మంది ప్రాణాలను బలిగొంటుందో చూస్తూనే ఉన్నాం. కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనం బలంగా ఉండాలి. మన జీవితంలో కరోనా ఓ భాగమైపోతుందేమోననిపిస్తుంది” అని బాలకృష్ణ అన్నారు.