గురుకులాల ఐఐటీ ర్యాంకర్లకు జగన్‌ అభినందన

వారు అడవి బిడ్డలు. కొండ కోనల్లో కష్టాలే పాఠాలుగా నేర్చుకేనే వారు! వీరిలో కొందరి తల్లితండ్రులు అటవీ ఉత్పత్తులను గ్రామగ్రామాన తిరిగి అమ్ముతుంటే, మరికొందరు కూలీనాలితో రెక్కలను ముక్కలు చేసుకుంటున్నారు. ఉన్న ప్రాంతం నుండి పాఠశాలకు వెళ్లాలంటేనే 10, 15 కి.మీలు నడిచి వెళ్ళాల్సిన స్థితి. మధ్యలో ఏ వాగో వంకో పొంగితే ఆ రోజుకి అంతే! ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నత విద్య గురించి ఆలోచించడమే కష్టం. దీనికి తోడు కరోనా కష్టాలు.. అయితే, ఏం ఆ గిరి పుత్రులు మహాద్భుతాన్ని సాధించారు. ఐఐటిలో ఆలిండియా ర్యాంకుల పంట పండించారు. గిరిజన గురుకుల చరిత్రలోనే రికార్డు సృష్టించారు. ఏకంగా 9 ర్యాంకులు సాధించారు. వీరంతా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని మంగళవారం కలిశారు. తమ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన ఉన్నత విద్య కోర్సులను చదువుతామని చెప్పారు. ఈ సందర్భంగా సిఎం వారిని అభినందించారు. ర్యాంకర్లకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అనంతరం ప్రజాశక్తితో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు.