చలో గుంటూరు జైలు ఉద్రిక్తం.. గృహనిర్బంధంలో పలువురు నేతలు..

రాజధాని ఎస్‌సి ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతల పిలుపు మేరకు.. శనివారం చేపట్టిన చలో గుంటూరు జైలు ఉద్రిక్తంగా మారింది. అమరావతి రైతులను అరెస్టు చేసి వారికి బేడీలు వేసి తరలించినందుకు నిరసనగా.. చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చిన రాజధాని ఎస్‌సి ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. రైతులను రిమాండ్‌లో ఉంచిన జైలు వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లోకి ఎవ్వరూ రాకుండా ఆంక్షలను విధించారు. జైలు బయట బస్టాండ్‌లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పంపించేస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళతోపాటు మరికొందరిని అరెస్టు చేశారు.