టెలిమెడిసిన్ కోసం కొత్త బైకులు- సీఎం జగన్

టెలీమెడిసిన్‌ కోసం కొత్త బైక్‌లను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ఎమెర్జెన్సీ సేవలకు కూడా ఏ లోటూ చూడాలన్నారు. బుధవారం ఆయన కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలన్నారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.