ట్రాన్స్ కో పటిష్టంగా ఉంటేనే మెరుగైన ‘విద్యుత్’ : పెద్దిరెడ్డి 

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఎపి ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో విద్యుత్ ట్రాన్స్ కో అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిస్కంలకు విద్యుత్ ను సరఫరా చేయడంలో ట్రాన్క్ కో సమర్థవంతమైన నెట్ వర్క్ తో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్క్ కో ఆధ్వర్యంలో నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు, పంపిణీ వ్యవస్థలో భాగంగా సబ్ స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 కెవి సామర్థ్యం కలిగిన 16 సబ్ స్టేషన్లు, 220 కెవి సామర్థ్యం ఉన్న 103 సబ్ స్టేషన్లు, 132 కెవి సామర్థ్యం ఉన్న 232 సబ్ స్టేషన్లు ఉన్నాయని, వాటి ద్వారా డిస్కం లకు విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు.