ఢిల్లీలో ప్రియాంక గాంధీ ధర్నా

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్‌ చేశారు. హత్రాస్‌ ఘటనపై దేశమంతా స్పందించాలని ఆమె కోరారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమూ దక్కలేదని అన్నారు. అంత్యక్రియలు కూడా కుటుంబ సభ్యులు నిర్వహించలేకపోయారని పేర్కొన్నారు. ఇది మన దేశ సంప్రదాయం కానేకాదని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. యుపిలోని హత్రాస్‌లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేయడంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ బాధితురాలు ఇటీవల మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిన్న బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ, ప్రింయాంక గాంధీ వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని రాహుల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.