ఢిల్లీ వరుస విజయాలు.. హైదరాబాద్‌ వరుస పరాజయాలు.. గెలుపెవరిది?

ఐపిఎల్‌ 2020లో భాగంగా అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ స్టేడియం మంగళవారం మరో పోరుకు సిద్ధమైంది. రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. రెండు వరుస పరాజయాలతో సతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఢిల్లీ దూసుకుపోతుంటే.. అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన చేస్తూ సన్‌రైజర్స్‌ డీలాపడిపోయింది. ఢిల్లీ గెలిచినా, సన్‌రైజర్స్‌ ఓడినా హ్యాట్రిక్‌ నమోదు కానుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. సన్‌రైజర్స్‌కు మొదటి నుంచి మిడిలార్డర్‌ సమస్య ఉంది. దీనికి తోడు లోయర్‌ ఆర్డర్‌ నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించడం లేదు. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌ జోడీపైనే సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది. ఒక్కరు విఫలమయినా భారం మొత్తం మరొకరిపై పడుతోంది. మనీశ్‌ పాండే రాణించడం సానుకూలాంశం. గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన కేన్‌ విలియమ్సన్‌ ఇవాళ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొహమ్మద్‌ నబీపై వేటు పడనుంది. దేశీ ఆటగాళ్లు వద్ధిమాన్‌ సాహా, ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నారు. ఇక బౌలింగ్‌ విభాగంలో రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లనే సన్‌రైజర్స్‌ నమ్ముకుంది. అయితే వీరిద్దరూ అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా గాడిలో పడితే టోర్నీలో బోణీ కొట్టొచ్చు. సిద్ధార్థ్‌ కౌల్‌, టీ నటరాజన్‌ కూడా సత్తాచాటితే సన్‌రైజర్స్‌ కోలుకునే అవకాశం ఉంటుంది.