తక్షణ సాయం అందించండి : సిఎస్‌ నీలం సాహ్ని

తుపాను, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి సాయం అందేలా చూడాలని సిఎస్‌ నీలం సాహ్ని కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం సచివాలయంలో వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రబృందం పరిశీలించింది. అనంతరం సౌరవ్‌ రారు నేతఅత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ కేంద్ర బఅందం వివిధ శాఖల అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివిధ శాఖల వారీ జరిగిన నష్టం వివరాలను వివరించారు. రైతుల నుండి తడిసిన రంగుమారిన ధాన్యాన్ని, దెబ్బతిన్న వేరుశెనగ పంటను కొనుగోలు చేసేందుకుగానూ తక్షణమే ”ఫెయిర్‌ ఎవరెజ్‌ క్వాలిటీ” నిబంధనలను కేంద్రప్రభుత్వం సడలించాలని సిఎస్‌ విజ్ఞప్తి చేశారు. రూ.6,386కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్ర బఅందానికి తెలిపారు. తాత్కాలిక పున:రుద్ధరణ సహాయ చర్యలకు రూ.840 కోట్లు, శాశ్వత పున:రుద్ధరణ చర్యలకు రూ.4,439కోట్లు అవసరమని కోరారు. ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణనష్టాలను చాలా వరకు తగ్గించామని, ఇన్‌పుట్‌ సబ్సిడీని వెంటనే అదించి రైతులకు కొంతమేర ఉపశమనం కలిగించామని పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించి 2లక్షల 12వేల హెక్టార్లు దెబ్బతిని, రూ.903 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఉద్యానవన పంటలు 24వేల 515 హెక్టార్లు దెబ్బతిని, రూ.483 కోట్లు, ఆర్‌ అండ్‌ బి కి సంబంధించి 5,583 కి.మీ రోడ్లు దెబ్బతిని 2వేల 976కోట్లు, పంచాయతీరాజ్‌ 3, 125 కి.మీలు దెబ్బతిని రూ.781కోట్లు, నీటిపారుదలకు 1074కోట్లు, మున్సిపాలిటీలకు రూ.75కోట్లు నష్టం వాటిల్లినట్లు వివరించారు.