తెలంగాణను తాకిన కొత్త రకం వైరస్‌

కొత్త రకం కరోనా వైరస్‌ తెలంగాణను కూడా తాకింది. వరంగల్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తిలో కరోనా కొత్త రకం వైరస్‌ ను సిసిఎంబి నిర్థారించింది.      వివరాల్లోకెళితే.. ఈ నెల 10 న 49 ఏళ్ల వ్యక్తి యూకే నుంచి వరంగల్‌కు వచ్చాడు. ఈ నెల 16 న ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో స్థానికంగా పరీక్షలు చేయించారు. ఈ నెల 22 న ఫలితాలు రాగా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వెంటనే అక్కడే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.    ఆ వ్యక్తి బ్రిటన్‌ నుంచి రావడంతో రెండు రోజుల క్రితం నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీ కి పంపించారు. పరీక్షించిన శాస్త్రవేత్తలు ఆయనకు సోకింది కొత్త స్ట్రెయినేనని నిర్ధారించారు. ఈ సమాచారాన్ని ఆదివారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. అతనికి కరోనా స్ట్రెయిన్‌ ఉన్నట్టు సీసీఎంబీ నిర్ధారించినా, ఆరోగ్య శాఖ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.