నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలిపారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు. ఒకవైపు కరోనా కేసుల తీవ్రత ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమని విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్‌ అని సెటైర్‌ వేశారు. జూమ్‌ బాబుతో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా, ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు.