పంట సమస్యలపై 24 గంటల్లో పరిష్కారం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంట సమస్యలపై ఏర్పాటు చేసే కాల్‌ సెంటర్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమర్థవంతంగా పని చేసేలా తీర్చిదిద్దాలన్నారు. ఎలక్ట్రానిక్‌ పంటల నమోదు (ఇ–క్రాప్‌ బుకింగ్‌) విధానం వ్యవసాయ రంగంలో కీలక మలుపని అభివర్ణించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇ–పంట నమోదు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పని తీరు గురించి ఆరా తీశారు. గత సమావేశాల్లో వచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆండ్రాయిడ్‌ ఆధారిత అప్లికేషన్‌ను రూపొందించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇ–పంట నమోదుతో పంటల బీమా, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు, ఏయే పంట ఎన్ని ఎకరాల్లో సాగయిందీ, ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించాల్సి వస్తే లబ్ధిదారులు ఎవరనేది సత్వరమే గుర్తించి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని సీఎం అన్నారు. ఇ–పంట విధానాన్ని బ్యాంకులకు అనుసంధానం చేస్తే సకాలంలో రుణాలు ఇవ్వడానికి, వేసిన పంటలకు తగినట్టుగా రుణం పొందడానికి ఉపయోగపడుతుందన్నారు.