పార్లమెంటులో ఆగని రైతు పోరు..

పార్లమెంటు ఉభయసభలూ బుధవారం నాడు కూడా రైతు సమస్యలపై దద్దరిల్లాయి. మోడీ ప్రభుత్వం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండు సభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో లోక్‌సభ వాయిదాల బాట పట్టింది. రాజ్యసభ ఒకసారి వాయిదా పడింది. ఈ సభలో ఇద్దరు ఆప్‌ సభ్యులు సస్పెండ్‌కు గురయ్యారు. మధ్యాహ్నాం నాలుగు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. వెంటనే స్పీకర్‌ ఓం బిర్లా సభను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి నెలకొంది. దీంతో పది నిమిషాలకే సభను సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేశారు.