ఫిబ్రవరి 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభం

కరోనా పరిస్ధితుల నేపధ్యంలో విరామం ప్రకటించిన అంగన్‌వాడీ కేంద్రాలను ఫిబ్రవరి 1 నుండి తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించవచ్చని నిర్దేశించగా.. సుప్రీం కోర్టు సైతం రిట్‌ పిటిషన్‌ (సివిల్‌) నెం.1039/2020లో ఇదే విషయంపై స్పష్టత ఇచ్చిందని వివరించారు. గర్భిణీ, బాలింతలు, 6-72 నెలల వయస్సు పిల్లలకు గతేడాది మార్చి 23 నుండి ఈ ఏడాది జనవరి 31 వరకు టేక్‌ హోమ్‌ రేషన్‌ అందించామని, తాజా పరిస్ధితుల నేపధ్యంలో పూర్తి స్థాయి సమీక్ష తదుపరి కరోనా మార్గదర్శకాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించాలని సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు. 36 నుండి 72 నెలల వయస్సు కలిగిన ప్రీ-స్కూల్‌ పిల్లలకు మిడ్‌ డే భోజనం అందిస్తామని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య, అరోగ్యపరమైన జాగ్రత్తలతో కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.