భార‌త్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా  ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన తెలిపారు.  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తోన్న న్యాయ‌మైన పోరాటాన్ని కేసీఆర్ స‌మ‌ర్థించారు.  రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని,  ఈ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొనాలని, బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.