మే 31 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో మార్గదర్శకాలు జారీ చేయనుంది. కాగా నాలుగో విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి.ఇక లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలపై కేంద్రం ఎలాంటి నిబంధనలతో ముందుకొస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, హోం శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ కార‍్యదర్శి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నాలుగో విడత లాక్‌డౌన్‌ అమలుపై సంప్రదింపులు జరుపుతారు. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలు, సడలింపులపై మార్గదర్శకాలను విడుదల చేస్తారు.