వినాయక చవితి వ్రతం.. వినాయక కథ, పూజా విధానం

వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.

శ్లోకం: ‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.

పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

పూజకు కావాల్సిన సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.

పూజా విధానం..

ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి.

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః