సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, కుట్రలతో ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే ముఖ్యమంత్రుల పనితీరులో టాప్ ఫైవ్ లో సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు సర్వేలో వెల్లడైందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోలేదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నీరుగార్చిందని నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సైతం అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.చంద్రబాబు, లోకేష్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌కు సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ‘‘గత ఐదేళ్లగా చంద్రబాబుని భ్రష్టు పట్టించింది లోకేష్ కాదా? గత ఐదేళ్లూ కూడా కుల జాడ్యం, అవినీతికి, అక్రమాలకి లోకేష్ కారణం కాదా? లోకేష్ నాయకత్వాన్ని మీ ఎమ్మెల్యేలలో‌ ఒక్కరైనా ఒప్పుకుంటారా. లోకేష్ వల్లే టీడీపీ పూర్తిగా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా? ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత బాధితులని లోకేష్ ఎందుకు పరామర్శించలేదని’ మంత్రి ప్రశ్నించారు.