10న నూతన పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన.. భవన విశేషాలు ఇవే!

93 ఏళ్లనాటి చరిత్ర కలిగిన ప్రస్తుత భారత పార్లమెంట్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి నిర్ణయించింది. ఈ నూతన భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్నారు. దీన్ని 2022 నాటికి పూర్తి చేయాలని అంచనా వేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి అప్పటి నుంచి ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నాలుగు అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనానికి మొత్తం ఆరు ప్రవేశ మార్గాలు, భవనంలో 120 కార్యాలయాలు ఉంటాయి. దేశీయ వాస్తు రీతిల్లో నిర్మించనున్న ఈ భవనంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు చూడవచ్చు. సాంస్కృతిక వైవిధ్యం కూడా కనిపిస్తుంది.