నా చిన్న నాటి కల నెరవేరింది: రష్మిక

అందాల సుందరి రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు పాపులారిటీ ఉంది. ముఖ్యంగా పుష్ప తో రష్మిక క్రేజ్ విదేశాలకు కూడా పాకిపోయింది. ఇటీవల ఆమెను జపాన్‌కు ఆహ్వానించారు. అక్కడ జరిగిన అవార్డు వేడుకకు రష్మిక మందన్న అతిథిగా హాజరైంది. జపాన్‌లో తన అభిమానులు చూపుతున్న ప్రేమకు ఆమె పొంగిపోతోంది. ఇదే విషయాన్నిసోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇకపై ఏటా జపాన్ ను సందర్శిస్తానని తెలిపింది. నేను చాలా ఏళ్లుగా జపాన్ వెళ్లాలని అనుకుంటున్నాను. అక్కడ జరిగే అవార్డు వేడుకకు వెళ్లి అవార్డు ఇస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. జపాన్ వెళ్లాలన్న కల ఎట్టకేలకు నెరవేరింది. ఇక్కడి ప్రజల నుండి నాకు హృదయపూర్వక స్వాగతం, చాలా ప్రేమ లభించింది. ధన్యవాదాలు జపాన్. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను అని తన సోషల్ మీడియాల్లో రాసుకొచ్చింది.

అలాగే జపాన్‌లోని ఫొటోలను కూడా షేర్ చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. కొద్ది గంటల్లోనే 15 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేయాగా .. 7 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2, రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తోంది. పుష్ప 2 ఆగస్ట్ 15న విడుదల కానుంది. అదే సమయంలో ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.