బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఇటీవల లండన్ వెళ్లగా.. అక్కడ రోడ్‌పై కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే రవీనా వారికి సెల్ఫీ ఇవ్వకుండా.. సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అభిమానులకు సెల్ఫీ ఇచ్చే సమయం కూడా లేదా అని నెటిజెన్స్ మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై రవీనా తన ఎక్స్ వేదికగా స్పందించారు. తాను సెల్ఫీ ఇవ్వని వారికి క్షమాపణలు చెప్పారు. అంతేకాదు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.
ఇటీవల జరిగిన సంఘటనతో చాలా భయపడుతున్నా. లండన్‌లో రోడ్‌పై నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నా. ఆ సమయంలో నా దగ్గరకు ఫొటో కోసం వచ్చినప్పుడు ఎందుకొచ్చారో అని చాలా భయమేసింది. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయా. బాంద్రాలో నాకు ఎదురైన ఘటన నుంచి నేనింకా కోలుకోలేదు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నా. వారికి ఫొటో ఇవ్వాలని నాకు అనిపించింది. కానీ ధైర్యం చేయలేకపోయా. వారికి క్షమాపణలు చెబుతున్నా. వారికి వివరణ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. మీకు సెల్ఫీ ఇవ్వనందుకు నన్ను క్షమించండి.