పురచ్చితలైవిగా ఖ్యాతిగాంచిన జయలలిత తమిళ రాజకీయాలను తన కంటిచూపుతోనే శాసించారు. కన్నడ నాట జన్మించి తమిళనాడులో స్థిరపడి వెండితెరపై ఓ వెలుగు వెలిగిన జయలలిత.. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు సీఎంగా జయన ఎదిగిన తీరు ఓ అద్భుతం. 1991 నుంచి 2016 వరకు 14 ఏళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత.. తమిళులతో ‘అమ్మ’ అని పిలిపించుకునేంత ఎత్తుకు ఎదిగారు.
కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపుర మేల్కోటోని సంప్రదాయ అయ్యంగార్ల కుటుంబంలో 1948 ఫిబ్రవరి 24న వేదవల్లి, జయరాం దంపతులకు జయలలిత జన్మించారు. అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు కోమలవల్లి, జయలలిత అనే పేర్లు పెట్టారు. ఆమె తాత నరసింహన్ రంగాచార్యులు.. మైసూరు మహారాజా సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా పనిచేశారు. జయ జన్మించిన రెండేళ్లకే తండ్రి చనిపోవడంతో బెంగుళూరులోని అమ్మమ్మ గారింటికి చేరింది.
చదువుతోపాటు ఆటపాటల్లోనూ ముందుండే జయలలిత ప్రాథమిక విద్యను బెంగుళూరులో పూర్తి చేశారు. అనంతరం మద్రాసు చర్చ్ పార్క్ కాన్వెంట్‌లో చేరి లలిత మెట్రిక్యులేషన్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. తండ్రిలాగే న్యాయ విద్య అభ్యసించాలని భావించినా కుదరలేదు. చదువుతోపాటు సంప్రదాయ భరతనాట్యం, మోహినీయాట్టం, మణిపురి, కథక్ లాంటి నృత్యరీతులను జయలలిత నేర్చుకున్నారు. సంప్రదాయ కర్నాటక సంగీతం కూడా అభ్యసించారు. అనంతరం మద్రాస్‌లో రంగస్థల నటిగా స్థిరపడ్డ సోదరి అంబుజవల్లి వద్ద ఉంటూ.. సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు. సంధ్య అనే పేరుతో తన నట ప్రస్థావాన్ని నాటకాలతో ప్రారంభించి.. కథానాయికి స్థాయికి ఎదిగారు.