ఐదవ దశ పోలింగ్ సందర్భంగా పలువురు బాలీవుడ్ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ కూడా ఓటు వేశారు. గతేదాది భారత పౌరసత్వం పొందాక ఆయన ఓటు వేయడం ఇదే తొలిసారి. పోలింగ్ బూత్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ మరింత అభివృద్ధి చెందిన దేశంగా, శక్తిమంతంగా మారాలని కోరుకుంటున్నా. ఈ దృష్టిలోనే నేను ఓటు వేశాను. భారతీయులు కూడా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలి. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందనే అనుకుంటున్నా అన్నారు.
2019లో ఆయన మళ్లీ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదే ఆయనకు పౌరసత్వం మళ్లీ లభించింది. అంతకుమునుపు అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం వదులుకోవడంపై స్పందించారు. నా సర్వస్వం భారత దేశమే. నేను సంపాదించింది, నేను పొందిందీ అంతా భారత్‌లోనే. దేశానికి నాకు చేతనైనంత తిరిగిచ్చే అవకాశం దక్కడం నా అదృష్టం.