తెలుగు రాష్ట్రాలకు ఇవాళ బిగ్ డే.. విభజన సమస్యలకు చెక్ పడుతుందా? జలాలవాటా నుంచి ఆస్తుల పంపకాల దాకా.. అన్ని కొలిక్కి వస్తాయా..? CMల ఫస్ట్ మీటింగ్‌లో జరిగేదేంటి? అనేది.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. రెండు రాష్ట్రాల విభజన అంశాలను తేల్చేయడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చర్చించబోతున్నారు. ఇదివరకటి ముఖ్యమంత్రుల సమావేశానికి, ఈ సమావేశానికి ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయిపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన.. పంపకాలు మాత్రం పూర్తి కాలేదు. తాజాగా, ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతుండటం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా విభజన అంశాలపై చర్చించుకుందామంటూ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం.. మళ్లీ రేవంత్ రెడ్డి చర్చించుకుందామంటూ చంద్రబాబుకు లేఖ రాయడం చకచకా జరిగిపోయాయి.. ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్ లో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా.. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.