రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు వేయటంపై చర్చ జరుగుతున్న సమయంలో గందరగోళానికి దారి తీసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రసంగిస్తుండగా విపక్షాలు పదే పదే అడ్డుతగలటమే కాకుండా సభ నుండి వాకౌట్ చేశాయి. విపక్షాల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మెన్ జగదీప్ ధనకర్ కూడా సభ నుండి వాకౌట్ చేశారు. తనను రోజూ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మెన్ విపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం మీద వారికి మాత్రమే హృదయం ఉందని విపక్షాలు భావిస్తున్నాయని అన్నారు. వినేశ్ ఫోగాట్ అంశం పట్ల దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోందని… ఈ ఇష్యూను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు ఈ అంశం ద్వారా లాభపడాలని అనుకోవటం వినేశ్ ఫోగాట్ కి అవమానమని అన్నారు. ఫోగాట్ కి చాలా భవిష్యత్తు ఉందని అన్నారు ధనకర్.