ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే..

free-bus.jpg

ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ లోని మహిళలకు ఉచిత రవాణా హామీ పై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కుప్పం ఆర్టీసీ బస్టాండు, డిపో ఆధునీకరణ పనులకు ఆదేశించారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుప్పంలో ఆర్టీసీ కొత్త బస్సులను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పరిస్థితిని అధ్యయనం చేస్తామన్నారు. లోటుపాట్లను గుర్తించి ఏపీలో పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వైసీపీ నేతలు ఆర్టీసీ స్థలాలు దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూస్తామన్నారు. కుప్పం బస్టాండ్, డిపో ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 5 కొత్త బస్సులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదని విమర్శించారు మంత్రి రాంప్రసాద్. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామన్న మంత్రి ప్రభుత్వంలో ఏపీఏస్ ఆర్టీసీని 100 శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. డిజల్ రేట్స్ తగ్గినా బస్సు చార్జీలను పెంచిన ఘనత  గత ప్రభుత్వానిది అంటూ విమర్శించారు.  జగన్ మాటలను ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సుకు ఫ్రీగా వాడమన్నారు మంత్రి రాంప్రసాద్.

Share this post

scroll to top