విశాఖ ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు.. సీఎం జగన్ సమీక్ష

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌ ఆదేశాలతో విచారణ కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హైపవర్‌ కమిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కరికలవలవన్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కె మీనా, పీసీబీ మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ, గ్యాస్ లీకేజ్‌‌‌కు కారణాలపై దర్యాప్తు చేయనుంది. కంపెనీకి సంబంధించిన అనుమతి పత్రాలను కమిటీ పరిశీలించనుంది. కంపెనీ కార్యకలాపాల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ఆరా తీయనుంది. విచారణలో ఎదురైన అంశాలు, ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం వెల్లడించిన అభిప్రాయాలతో నెల రోజుల్లో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని హైపవర్ కమిటీకి సూచించారు.