రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక

 కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లకు సంబంధించిన ఎన్నికలను రేపు(బుధవారం) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. టిడిపి దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ హైకోర్టుకు రావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ , రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇన్ఛార్జి సిపి కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. వివరణ అనంతరం రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నిక జరిపేలా మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. పిటీషనర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీని హైకోర్టు ఆదేశించింది