పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో చేయించడంతో వలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తమకు జీతాలు పెంచుతామని చెప్పిన కూటమి నేతలు.. తీరా అధికారంలో వచ్చాక విధులకు తమను దూరం చేయడాన్ని ప్రతికూల సంకేతంగా భావిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థకు భద్రత కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వలంటీర్లు చలో విజయవాడకు పిలుపు ఇచ్చారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో విజయవాడలో హైఅలర్ట్ నెలకొంది. కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. నగర వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలంటీర్లను అదుపులోకి తీసుకునేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరినీ చెక్ చేయడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన ప్రచారంతో ఇంత హడావిడి చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ర్యాలీ, ప్రదర్శనలకు వలంటీర్లు తమను ఎలాంటి అనుమతి కోరలేదని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల కట్టడి సెక్షన్‌లు అమలులో ఉన్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు వలంటీర్ సేవల్ని ఎలా ఉపయోగించుకుంటారు?.. వాళ్ల ఉద్యోగ భద్రతపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం.