రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం.. ఉద్రిక్తత

raj-bhavan-01.jpg

పీపుల్స్ ప్లాజా నుంచి రాజభవన్ వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను ఐమ్యాక్స్ సర్కిల్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌కు తరలించారు. రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సహా ఎన్ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, వీజేఎస్, ఏఐపీఎస్‌యూ, పీవైసీ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎప్, పీవైఎల్, వైజేఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని రుజువైనా కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ పరీక్షలు రద్దు చేయకుండా మౌనంగా ఉండడం దుర్మార్గమని మండిపడ్డారు. గత 20 రోజుల నుంచి నీట్ విద్యార్థుల పక్షాన అన్ని సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 70 వేలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారన్నారు. అపాయింట్‌మెంట్ అడిగినా కిషన్ రెడి స్పందించకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించామని తెలిపారు. స్టూడెంట్ మార్చ్ నిర్వహించామని.. సిగ్నిచర్ కాంపెయిన్ చేశామ నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశామని చెప్పారు. గవర్నర్‌కు నీట్ విద్యార్థుల పక్షాన రిప్రెసెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ కోరితే ఇవ్వలేదని.. అందుకే రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరమని వెల్లడించారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మహా దీక్ష చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే నీట్ కౌన్సిలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు బంద్ పిలుపునిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఎన్‌టీఏను, నీట్ పరీక్షలు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు.

Share this post

scroll to top