ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. జనసేనానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో ఆయన పవన్‌కు చిన్న రిక్వెస్ట్ కూడా చేశారు.
“అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్న మీరిచ్చిన సందేశం హర్షణీయం. మీ వ్యాఖ్యలకు భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింస, భౌతిక దాడులు, వేధింపులపై మీరు స్పందించాలి. శాసనసభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదు. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు” అని ట్వీట్‌లో బాలినేని రాసుకొచ్చారు.