మున్సిపల్ కార్పొరేషన్‌కు తన రాజీనామా విషయంలో తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి భూమన అభినయ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అందులో ఎలాంటి గోప్యతా లేదని.. తాను రాజీనామా ఎప్పుడు చేశానో, దానికి ఎప్పుడు ఆమోదం లభించిందో.. తదితర విషయాల్ని ఆయన మీడియాకు వివరించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, అలాగే నేను ప్రాతినిథ్యం వహించిన నాల్గో డివిజన్ కార్పొరేషన్ పదవికి నేను ఎప్పుడో రాజీనామా చేశాను. తిరుపతి వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నా పేరు ఖరారైన వెంటనే, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా ఆ పదవుల్ని వద్దనుకున్నా. నా రాజీనామాను మేయర్ డాక్టర్ శిరీష గారితో పాటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆమోదం తెలిపారు. నేను పదవులకు రాజీనామా చేసిన విషయం ఎన్నికలకు ముందు అన్ని పత్రికల్లో వచ్చింది. తాజాగా ఒక పత్రికలో నా రాజీనామాల విషయాన్ని గోప్యంగా వుంచానని రాయడం ఆశ్చర్యం అనిపించింది.