ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడమే కాకుండా, అడ్డుకున్న తమపై బెదిరింపులకు పాల్పడుతున్న కబ్జారాయుళ్లను ఉపేక్షించేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. చక్రిపురం కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఉప్పల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.లక్ష్మణ్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. పారిశ్రామిక అవసరాల నిమిత్తం 1966లో సేకరించిన వందలాది ఎకరాలలో కాప్రా మండల పరిధిలోని సర్వే నంబర్లు 215, 222లలో దాదాపు 27.5 ఎకరాల స్థలం ఉందని వెల్లడించారు. ప్రభుత్వం గుర్తించిన ఈ భూమిలో కొందరు వ్యక్తులు లేఅవుట్ వేసి విక్రయించారని, ప్రస్తుతం ఇందులో కాలనీలు వెలిశాయని వివరించారు. ఖాళీగా ఉన్న ఓపెన్ ప్లాట్లను గుర్తించిన రెవెన్యూ అధికారులు 2011 సంవత్సరంలో సదరు ప్లాట్లలో ప్రభుత్వ స్థలమని పేర్కొంటూ బోర్డులు కూడా ఏర్పాటుచేశారు.