హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ నాయకులు భయపడేది లేదన్నారు. కాగా, కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడేది లేదు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా?. ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా?. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పనపైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా?’ అని ప్రశ్నలు సంధించారు.