తెలంగాణలో మళ్లీ హస్తం షో మొదలయింది. ఫస్ట్ సీజన్‌లో ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. తాజాగా సెకండ్ సీజన్‌ను స్టార్ట్ చేశారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడడంతో ఇప్పటికే షాక్ మీదున్న బీఆర్‌ఎస్‌కు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరో షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. సంజయ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు బరిలో దిగిన సంజయ్..రెండు సార్లూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై గెలుపొందారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సన్నిహితంగా మెలిగే సంజయ్, ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఊహించలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికపై బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రోజునే తన ప్రత్యర్థి అయిన సంజయ్, కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆసక్తి రేపుతోంది. సంజయ్ చేరికతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. బీఆర్‌ఎస్‌కు చెందిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, సంజయ్ కారుకు గుడ్‌బై చెప్పి, హస్తం పార్టీలో చేరిపోయారు.