బెయిలుపై తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో కవిత మరో నెల రోజులు జైలులో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు కావడంతో రిజర్వు చేసిన తీర్పు వెలువడే అవకాశం లేదు. కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు నిన్న బెయిలు పిటిషన్ అంశాన్ని కోర్టులో లేవనెత్తినప్పటికీ కేసు లిస్టు కాలేదని రిజిస్ట్రార్ తెలియజేశారు. దీంతో కోర్టు సెలవులు ముగిశాక కానీ బెయిలుపై తీర్పు వెలువడే అవకాశం లేకుండా పోయింది. జూన్ 30 ఆదివారం కావడంతో జులై మొదటి వారంలోనే కవిత బెయిలు పిటిషన్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ నెల 3తో కవిత జుడీషియల్ కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని మరోమారు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది.