వారెవ్వా.. సింగర్‌గా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. సూపర్ అంతే..

bandi-01-.jpg

రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సింగర్‌గా మారారు. ఓ కార్యక్రమంలో పాట పాడి అదరగొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధిపేటజిల్లా హుస్నాబాద్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. తానూ శిశుమందిర్ లోనే చదువుకున్నానంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చారు. సంస్కృతి, సాంప్రదాయాలకు శిశు మందిర్ పాఠశాలలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను చిన్నాభిన్నం చేశాయన్నారు. భవిష్యత్‌ తరాలకు మంచి మార్గంలో బోధన అందించేందుకు శిశు మందిర్‌ విద్యా సంస్థలు దోహద పడతాయన్నారు. శిశుమందిర్ విద్యార్థిగా క్రమశిక్షణ, న్యాయం, ధర్మం కోసం పోరాడితే తనపై 109 కేసులు పెట్టారన్నారు. హిందూ ధర్మం, దేవుళ్లను హేళన చేసే పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్నాయని బండి సంజయ్ ఆవేదన అందుకున్నారు. అలాంటివి చూస్తే తనకు ఓ పాట గుర్తుకు వస్తుందన్నారు. ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం. .కష్టసుఖములలోన కలిసి మెలసుంటుంటే, బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్ని పండేనురా’ అనే పాటను పాడి వినిపించారు. దీంతో బండి సంజయ్ పాటకు అక్కడున్నవారంతా చప్పట్లతో ప్రశంసించారు. శిశు మందిరం పాఠశాలలో చదవడం తన అదృష్టమన్నారు బండి సంజయ్‌. ఈ స్థాయికి ఎదిగానంటే శిశుమందిర్‌ ఇచ్చిన సంస్కారమే అని చెప్పారు.

Share this post

scroll to top