ఏపీలో శాంతిభద్రతలు, గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన హత్యాచారం, అత్యాచార ఘటనలు అత్యంత హేయమని హోంమంత్రి అన్నారు. ముచ్చుమర్రిలో బాలికను హత్యాచారం చేసి రాయికట్టి మరీ రిజర్వాయర్‌లో పడేశారు. రామభద్రాపురంలో తాగిన మైకంలో తాత వరసయ్యే వ్యక్తి ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు. సమీక్షలో ఈ రెండు సంఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని హోంమంత్రి చెప్పుకొచ్చారు. రెండు సంఘటనల్లో బాలికల కుటుంబసభ్యులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. మద్యం, గంజాయి మత్తులో నిందితులు ఈ దారుణాలకు పాల్పడ్డారని, రెండు సంఘటనలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ముచ్చుమర్రి ఘటనలో నిందితులుగా ముగ్గురు మైనర్లు ఉన్నారని, ఫోన్లలో అశ్లీల వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తుండటం ఈ తరహా ఘటనలకు కారణం అవుతున్నాయని అనిత అన్నారు. నేరస్థుల విషయంలో రాజకీయ పార్టీలు, కులాలు ఏమీ ఉండవని, నిందితులకు తప్పకుండా శిక్ష పడాల్సిందేనని ముఖ్యమంత్రి చెప్పినట్లు హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు.