ఇదే దేవుడి స్క్రిప్ట్.. అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

naidu-20.jpg

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు.. అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు రాజధాని టూర్‌ మొదలు కాగా.. అక్కడ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఉద్దండరాయుడిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం.. అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. ఫౌండేషన్‌ స్టోన్‌ దగ్గర ఫొటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్‌ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. రాయపూడిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ,నిర్మాణదశలో ఉన్న భవనాలు.. నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. హైకోర్టు, సెక్రటేరియట్‌, జడ్జి క్వార్టర్స్‌ బిల్డింగులను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతంలో ఐదేళ్లుగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. కనీసం 70 నుంచి 80శాతం పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజారాజధానిపై అనేక కుట్రలు, విషప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతినేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారని.. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అంటూ పేర్కొన్నారు.

Share this post

scroll to top