తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వారికి ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. సోలార్ పంపు సెట్ల ద్వారా భవిష్యత్తులో రైతులకు విద్యుత్ ఇబ్బంది తలెత్తదని నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంటుందన్నారు.
అంతేకాక తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలసి సీఎం తన నివాసంలో విద్యుత్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారికి పలు సూచనలు జారీ చేశారు.